మోదీ సర్కార్ ఆమోదించిన పౌరసత్వ సవరణచట్టం (సీఏఏ) భారత రాజ్యాంగానికనుగుణంగా ఉందా? లేదా? అన్న సం గతిని ఆ దేశ సుప్రీంకోర్టు నిర్ణయిస్తుందని ఐరోపా కమిషన్ ఉపాధ్యక్షురాలు, ఈయూ విదేశాంగ వ్యవహారాలు, భద్రతా విధానంపై ఉన్నతస్థాయి ప్రతినిధి హెలెనా డాలీ పేర్కొన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా ఐరోపా పార్లమెంట్‌లోని ఆరు ప్రధాన రాజకీయ గ్రూపులు వేర్వేరుగా రూపొందించిన తీర్మానాలను ఒకే సంయుక్త ముసాయిదా తీర్మానంగా బుధవారం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై మార్చి నెలాఖరులో ఓటింగ్ జరుగనుండగా సభ్యు లు దానిపై చర్చ జరిపారు. చర్చను ప్రారంభించిన హెలెనా డాలీ మాట్లాడుతూ, భారత్‌తో ఈయూకు ఎంతో సంపన్న, నిష్కపటమైన, విస్తృతస్థాయి సంబంధాలున్నాయన్నారు. భారత్ ఆమోదించిన సీఏఏ చట్టం ఆ దేశ రాజ్యాంగానికనుగుణంగా ఉందో లేదో వారి సుప్రీంకోర్టు నిర్ణయిస్తుందన్న నమ్మకం తమకుందన్నారు. ప్రస్తుతం కోర్టులో కొనసాగుతున్న న్యాయ ప్రక్రియ ఆ దేశంలోని ఉద్రిక్తతలను, హింసను చల్లార్చగలదన్నారు. ఈయూ కు ఎంతో విలువైన భాగస్వామి అయిన భారత్‌ను గౌరవనీయ ప్రజాస్వామిక దేశంగా పరిగణించి, మరింత విస్తృతంగా చర్చలు జరుపాలని సూచించారు. భారత్-ఈయూ సదస్సు లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ మార్చి 15న బ్రస్సెల్స్‌కు రానున్నారన్నారు. మరోవైపు సీఏఏ వ్యతిరేక తీర్మానంపై చర్చలో బ్రిటన్‌కు చెందిన పలువురు ఎంపీలు మాట్లాడుతూ, ఓటింగ్ వాయిదా వేయడాన్ని తీవ్రం గా తప్పు పట్టా రు. సీఏఏ ఎంతో వివక్షాపూరితమైనదని ఆరోపించారు. భారత్ దౌత్యపరమైన లాబీయింగ్‌కు ఈయూ లొంగిపోయిందన్నారు. భారత్‌లో మానవ హక్కుల కన్నా తమ వ్యాపారాలకే అధిక ప్రాధాన్యమిచ్చారం టూ సభ్యులపై మండిపడ్డారు. ఈ ఆరోపణలను తిప్పి కొట్టిన పోలండ్ సభ్యుడు రైయిస్‌జార్డ్ జార్‌నెక్కీ.. ఈ చర్చలో విచక్షణా జ్ఞానం, గౌరవం విజయం సాధించాయన్నారు. మరో ఇద్దరు భారత సంతతి ఎంపీలు దినేశ్ ధమీ జా, నీనా గిల్ ఆయనకు మద్దతు తెలిపారు.